– రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 12.97 కోట్లు జమ
– ఆర్ఎస్‌కేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
– గోనె సంచులతో పాటు అవసరం మేరకు అందుబాటులో లేబర్, వాహనాలు
– పౌర సరఫరాల జిల్లా మేనేజర్ తోట వెంకట సతీష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ. 13.86 కోట్ల విలువైన 5,979.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 872 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ తోట వెంకట సతీష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఇప్పటికే రూ. 12.97 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. తిరువూరు డివిజన్‌లో 58 రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్‌కేలు), విజయవాడ డివిజన్ పరిధిలో 45 ఆర్ఎస్‌కేలు, నందిగామ డివిజన్ పరిధిలో 54 ఆర్ఎస్‌కేలు మొత్తం 157 ఆర్ఎస్‌కేలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ఒక పంట కాలంలో ఒక రైతు నుంచి గరిష్టంగా 25 ఎకరాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని.. ఎంటీయూ 1282, ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని కూడా కోనుగోలు చేయడం జరుగుతోందని.. ఈ విషయాలను రైతులు గమనించి, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోకూడదని..వాతావరణ ప్రతికూల సమయంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించుకోవచ్చన్నారు. తిరువూరు డివిజన్‌కు 2,88,853, విజయవాడ డివిజన్‌కు 1,62,000, నందిగామ డివిజన్‌కు 1,10,000 గోనె సంచులను అందించినట్లు వివరించారు. గోనె సంచులతో పాటు అవసరమైన లేబర్, 118 జీపీఎస్ అమర్చబడిన రవాణా వాహనాలు అందుబాటులో ఉన్నట్లు వెంకట సతీష్ తెలిపారు.