-జాప్యం లేకుండా పూడికతీత పనులు
-వేగవంతంగా కొత్త, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
బల్లికురవ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండలంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వివిధ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి.. రైతులకు ఎరువులు అందజేయడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని తెలిపారు. దీనితోపాటు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో రైతులు ఎలాంటి పంటలు వేస్తున్నారు అనేది పరిశీలించి క్రాప్ ఇన్సురెన్స్ ను చేయాలని సూచించారు. కాలువల్లో పూడికతీత పనులపై మంత్రి గొట్టిపాటి అడిగి తెలుసుకన్నారు. గత ఐదేళ్లుగా కాలువ పూడికతీతపై ప్రభుత్వం దృష్టి సారించలేదని అన్నారు. రైతాంగ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తాము అధికారంలోకి వచ్చిన తరువాత సొంత నిధులతో కాలువలో పూడిక తీత పనులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు నరకం చూశారని, ఎక్కడా కాలువలకు పూడికతీత పనులు చేయడం గానీ, రైతులకు వ్యవసాయ అవసరాలలో ప్రభుత్వపరమైన సాయం అందించడంలో గానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. మంత్రి గొట్టిపాటి పర్యటన స్థానిక రైతాంగంతో పాటు ప్రజల్లోనూ నూతన ఉత్సాహాన్నినింపింది. వివిధ వర్గాల వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా… అక్కడికక్కడే స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.., సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలతో పాటు పాత కరెంట్ స్తంభాలు, ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ల సమస్యలను.. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటి ద్రుష్టికి తీసుకురాగా… ప్రమాదకరంగా ఉన్న వాటిని వెంటనే మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త విద్యుత్ కనెక్షన్లను కూడా త్వరగా లబ్దిదారులకు వచ్చే విధంగా చూడాలని సంబంధిత యంత్రాంగానికి సూచించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై.. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీటితో పాటు ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, పారిశుధ్య సమస్యలూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
అదే విధంగా బల్లికురవ లో నూతన అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. 104, 108 సర్వీసులకు సంబంధించిన సిబ్బందికి వైసీపీ ప్రభుత్వంలోని ఏజెన్సీ గత కొంతకాలంగా జీతాలు అందించడం లేదని బాధితులు కొందరు మంత్రికి చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామాల్లో పలువురిని ఆర్థికంగా ఆదుకునే ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వాకబు చేశారు. మంత్రి స్వయంగా పలు విషయాలను పరిశీలించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.