-ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయండి
-అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వన్య ప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓ వైపు… మరో వైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్య ప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్య ప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులతో వన్య ప్రాణుల సంరక్షణపై సమీక్షించారు.
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎ.కె.నాయక్ ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో చనిపోయిన ఘటనను వివరిస్తూ ఏనుగులు కుప్పం నుంచి శేషాచలం కొండల వైపు కదులుతూ వ్యవసాయ భూముల్లోకి రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 123 ఏనుగులు కుప్పం, పలమనేరు, చిత్తూరు అటవీ రేంజ్‌ల గుండా సంచరిస్తున్నాయి. ఈ ఏనుగులు రిజర్వ్ ఫారెస్టుల సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి ప్రవేశిస్తూ ఉండటంతో పంట నష్టంతోపాటు మనుషుల-వన్యప్రాణుల ఘర్షణలకు దారి తీస్తోందని పీసీసీఎఫ్, ఫారెస్ట్ ఫోర్స్ అధికారి చిరంజీవి చౌదరి వివరించారు. అంతేకాకుండా పార్వతీపురం మన్యం జిల్లాలో 7 ఏనుగులు ఒక గుంపుగా.. మరో 4 ఏనుగులు ఇంకో గుంపుగా కూడా సంచరిస్తున్నాయని తెలిపారు. అడిషనల్ పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ డాక్టర్ శాంతి ప్రియా పాండే మాట్లాడుతూ దాదాపు 50 మంది శిక్షణ పొందిన ఎలిఫెంట్ ట్రాకర్స్, బేస్‌క్యాంప్ వాచర్లతో సహా అటవీ సిబ్బంది ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. సంఘర్షణలను నివారించడానికి జంతువులను అడవులలోకి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు.. ముఖ్యంగా ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ అధికారులు రూపొందించిన సోలార్ కంచెలను వేలాడదీసే వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేయాలన్నారు.
రైతుల ప్రాణాలతోపాటు, వన్యప్రాణుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించాలని ఆదేశించారు. ప్రజలను రక్షించడంతోపాటు వన్యప్రాణుల భద్రతను చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.