-అదానీ అవినీతిపర్వంపై ఎపి సిఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అదానీకి రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. అదానీ అవినీతిపర్వంపై ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అదానీ లంచగొండి వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని స్కిల్ యూనివర్సిటీకి అదానీ కంపెనీ ఇచ్చిన రూ.100 కోట్లను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనక్కి ఇచ్చేయడం అభినందనీయం. రూ.2100 కోట్ల రూపాయల అదానీ అవినీతిలో అధికభాగం రూ.1750 కోట్లు ఎపీలోనే ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులో కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌గాని అదానీ అవినీతిపై నోరుమెదపడం లేదు.
రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల భారం వేసేలా గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దుష్ట నిర్ణయాలు చేసింది. అందుకుగాను లంచం రూపంలో రూ.1750 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అదానీతో లాలూచీపడి, లొంగిపోయి రాష్ట్రంలోని పోర్టులు, సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములను, ప్రజా ఆస్తులను అదానీకి అప్పనంగా అప్పజెప్పింది.
ప్రధాని నరేంద్రమోడీ, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అదానీకి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నింటిపై సమగ్ర విచారణ జరపాలి. అదానీని, రూ.1750 కోట్లు లంచాలుగా తీసుకున్న వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి. గత వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దుచేయాలని కోరుతున్నామన్నారు.