మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’ (Desh ki Prakruti Parikshan Abhiyaan) దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ ను మంగళవారం మీకోసం హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) గుర్తించి, ఆ వివరాల ఆధారంగా, ఆరోగ్య స్థితిగతులను మరియు జీవనశైలి విధానాన్ని పొందుపరుస్తుందన్నారు. ఆయుర్వేదం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది మరింత ఆసక్తి కలిగించేలా ప్రాధాన్యతను పొందిందన్నారు. ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’ యాప్, ప్రతి వ్యక్తి యొక్క శరీర ధార్మిక స్వభావాన్ని (body constitution) అంచనా వేయడంలో సహాయపడుతుందన్నారు. ఆరోగ్యాన్ని ఆయుర్వేదం పద్ధతుల్లో నిర్వహించడం, ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆరోగ్య సూచనలు, ఆహార నియమాలు, అనుకూల మార్గదర్శకాలను అందించడం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయుర్వేద వైద్య నిపుణులు, వైద్యాధికారులు డాక్టర్ ప్రసన్న, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ మాధవి, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ జావేద్ ఖాన్, డాక్టర్ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భగవాన్ యాప్ ముఖ్య ప్రయోజనాలు వివరిస్తూ ప్రతి వ్యక్తి యొక్క శరీర ధార్మిక స్వభావం (body constitution) అంచనా వేయడం, ఆయా ధార్మిక స్వభావాలకు అనుగుణంగా ఆయుర్వేద ఆరోగ్య సూచనలు ఇవ్వడం, వ్యక్తిగత ఆరోగ్యానికి అనుకూల ఆహార పు అలవాట్లు, జీవనశైలి మార్గదర్శకాలను అందించడం, ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతులను ప్రోత్సహించడం. ఈ యాప్ పై పరిశోధన కార్యక్రమం 26 నవంబర్ 2024 నుంచి 25 డిసెంబర్ 2024 వరకు (ఒక నెలపాటు) దేశవ్యాప్తంగా ప్రతి ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి మరియు డిస్పెన్సరీలలో నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకుని తమ శరీర ధర్మస్వభావాన్ని అంచనా వేయించుకోవచ్చని, ఆయుర్వేద సూచనలను పొందవచ్చన్నారు.
ప్రతి ఒక్కరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆయుర్వేద పద్ధతులను తమ ఆరోగ్య సంరక్షణలో భాగం చేసుకోవాలని కలెక్టర్ గారు సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని ఆయుర్వేదం ద్వారా తమ ఆరోగ్య సంరక్షణకు దోహదపడవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డ్వామా పిడి శివ ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, సి పి ఓ గణేష్ కృష్ణ, పాల్గొన్నారు.