– పీఠికలోని ప్రతి అక్షరం రాజ్యాంగ విశిష్టతను చాటిచెప్పేదే
– రాజ్యాంగం చూపిన బాటలో నడిచి.. ఉత్తమ పౌరులుగా ఎదగాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రజలకు 75 ఏళ్లుగా అనుక్షణం తోడుగా, నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వతంత్ర భారతావనిని అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థతో సగర్వంగా నిలిపిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించుకోవడం జరిగిందని.. దేశ చరిత్రలో అపూర్వమైన ఈ ఘట్టానికి గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామని వివరించారు. రాజ్యాంగ పీఠికలోని ప్రతి అక్షరం రాజ్యంగ విశిష్టతను చాటిచెబుతోందని.. ఈ పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శరాలను తెలుసుకోవడం ద్వారా మనం ఎంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనేది స్పష్టమవుతుందన్నారు. రాజ్యాంగ విశిష్టతను తెలుసుకోవడమనేది ఏదో ఒక్క రోజుకే పరిమితం చేసుకోకుండా ప్రతిరోజూ రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగతి పథంలో పయనించాలని సూచించారు. రాజ్యాంగ రూపకల్పనకు విశేష కృషిచేసిన డా. బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల బాటలో యువత నడుస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.