– విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వ చర్యలు భేష్.
– స్కిల్ సెన్సస్ వంటి కార్యక్రమాలు సర్వత్రా అనుసరణీయం.
– మహారాష్ట్ర సాంకేతిక విద్య స్టేట్ బోర్డు డైరెక్టర్ డా. ప్రమోద్ నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాల అంతరాలను పూడ్చేందుకు తీసుకుంటున్న చర్యలు అభిలషణీయమని, సర్వత్రా అనుసరణీయమని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఎస్‌బీటీఈ) డైరెక్టర్ డా. ప్రమోద్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యలో అమలవుతున్న వైవిధ్య కార్యక్రమాల అధ్యయనానికి ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాల పర్యటనకు వచ్చిన ఎంఎస్‌బీటీఈ డైరెక్టర్ ప్రమోద్ నాయక్ నేతృత్వంలోని బృందం పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రమోద్ నాయక్ మాట్లాడుతూ ఏపీ సాంకేతిక విద్య డైరెక్టర్, ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) ఛైర్మన్ జి.గణేష్ కుమార్ నేతృత్వంలో బృందం రాష్ట్రంలోని 267 పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆధునిక ల్యాబ్‌లతో పరిశ్రమల అనుసంధానంతో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ అవర్, టెక్ ఫెస్ట్, అలుమ్ని మీట్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, క్రెడిట్ సిస్టమ్ వంటి కార్యక్రమాలతో ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుందని.. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ సెన్సస్ వంటి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత వేగవంతంగా పురోగమిస్తోందని.. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ (ఈవీ టెక్నాలజీ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులపైనా ప్రభుత్వం దృష్టిసారించడం ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమన్నారు. మొత్తంమీద ఏపీ పర్యటన పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిందని, ఇక్కడ పరిశీలించిన అంశాలతో తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు డా. ప్రమోద్ నాయక్ తెలిపారు.