– ప్రజాప్రయోజనాలతో ముడిపడిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించండి
– నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దస్త్రాల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా, నిబద్ధతతో, జవాబుదారీతనంతో సేవలందించాలని ముఖ్యంగా ప్రజాప్రయోజనాలతో ముడిపడిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన దస్త్రాలను సత్వరం పరిష్కరించాలని.. అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని.. తన పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని.. ఒకవేళ ఏవైనా అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటే వెంటనే ఆ పని చేయనున్నట్లు వివరించారు. ఈ విషయంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. వివిధ ప్రగతి సూచికల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా కీలక జిల్లా అని వివిధ రాష్ట్రస్థాయి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయని.. ఒకవైపు వీటిని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములవుతూనే మరోవైపు రోజువారీ అధికారిక విధుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.