– కొత్తగా ఓటరుగా నమోదుకు 18-19 ఏళ్లవారిపై దృష్టిపెట్టండి
– రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు ఎం.ఎం.నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియను సాఫీగా, విజయవంతంగా పూర్తిచేయాలంటే ఓటర్ల జాబితా దోషరహితంగా ఉండాలని.. ఈ నేపథ్యంలో జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ఎం.ఎం.నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎం.ఎం.నాయక్.. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2025పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, స్వచ్ఛీకరణపై ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా రూపొందించేందుకు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ఈ నెల 28వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉందని.. వీటిని డిసెంబర్ 24వ తేదీలోగా పరిష్కరించి జనవరి 6న తుది జాబితా ప్రచురించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారిని కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని.. ముఖ్యంగా 18-19 వయసువారిపై దృష్టిసారించి, నమోదుకు కృషిచేయాలన్నారు. ఇందుకు కళాశాలల్లోని ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లను క్రియాశీలం చేయాలన్నారు. అదే విధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయపక్షాల ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఇతర ఫారాలపైనా అవగాహన పెంపొందించాలన్నారు. జనాభాలో ఓటర్ల నిష్పత్తి, స్త్రీ-పురుష ఓటర్ల లింగ నిష్పత్తి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని.. లాజికల్, డెమోగ్రాఫికల్ దోషాలు ఉంటే చక్కదిద్దాలన్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ర్యాండమ్‌గా సూపర్ చెక్ చేయాలన్నారు.
డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం ఎస్ఎస్ఆర్-2025కు సంబంధించిన అంశాలను వివరించారు. 2024, అక్టోబర్ 29న ప్రచురించిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 17,04,611 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈపీ రేషియో 703గా, జెండర్ రేషియో 1052గా ఉందన్నారు. నవంబర్ 9, 10 తేదీలతో పాటు నవంబర్ 23, 24 తేదీల్లోనూ క్లెయిమ్‌లు, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించామన్నారు. దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించి తుది జాబితా ప్రచురణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరువూరు ఈఆర్‌వో కె.మాధురి, విజయవాడ తూర్పు ఈఆర్‌వో కె.చైతన్య, నందిగామ ఈఆర్‌వో కె.బాలకృష్ణ, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రామకృష్ణ, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.