-ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని జిల్లా అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించి అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. జి. లక్ష్మీశ ను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యకులు ఎ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు మంగళవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులు ఉద్యోగుల కృషి ఎంతో అవసరమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమన్నారు. జిల్లా యంత్రాంగం ఉద్యోగులు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు. ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేసే ఉద్యోగులు ప్రజలకు సేవలందించడంలో ఎల్లప్పుడు ముందుంటారన్నారు. ఉద్యోగులు పారదర్శకత, నిబద్ధతతో సేవలందిస్తూ జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించి జిల్లాను అభివృద్ధిలో నిలిపేందుకు కృషి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఉద్యోగులు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు.
జిల్లా కలెక్టరు కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్, బి.సతీష్ కుమార్, బీవీ రమణ, నాగేంద్ర రావు, నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఎస్ కె. నజీరుద్దీన్, వేమూరి ప్రసాద్, శివ శంకర్, శ్రీనివాస రావు, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యకులు ఎస్ కె. జానీ బాషా, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.