మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరంలో తడి పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో నగరంలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్ లోనే తడి పొడి చెత్త వేరువేరుగా నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, తడి చెత్తను ఎరువుగా మార్చి నగరంలోని డివైడర్లపై ఉన్న మొక్కలకు వినియోగించాలని, అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా అందజేయాలన్నారు. సేకరించిన పొడి చెత్తను నేరుగా జిందాల్ రీసైక్లింగ్ పరిశ్రమకు చేర్చాలన్నారు.
నిషేధించిన ప్రాంతంలో చెత్తను వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచిస్తూ ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ప్రజలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. కోనేరు సెంటర్లో తోపుడుబండ్ల మీద బాదంపాలు, ఇతర విక్రయాలు చేస్తూ పరిసర ప్రాంతాలను చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారుస్తున్నారని, ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, మార్కెటింగ్ ఏడి నిత్యానంద, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.