-ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
-జిల్లా కలెక్టరేట్ , డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు
-జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్: 0877-2236007
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈనెల నవంబర్ 26 నుండి 28 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలెర్ట్ సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి చెపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు కొనసాగించాలని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి డ్రెయిన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యస్థానం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల సమయంలో చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్ వే లపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్ అండ్ బి పంచాయితీ రాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యం లో తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏదైనా సహాయం, సమాచారం కోసం క్రింది నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 08624 – 252807
సూళ్లూరుపేట ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 08623-295345
తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040
శ్రీకాళహస్తి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 8555003504