-ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు: ఎస్పీ ఎల్.సుబ్బా రాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు ఈ నెల 28న హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎం పర్యటన ఏర్పాట్లపై ASL లో ( ముందస్తు భద్రత లైజన్) జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సోదరుడు మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియలకు హాజరు అగుటకు నారావారిపల్లెకు రేపు బుధవారం రానున్నారని, ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు వెళ్లనున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం నారావారి పల్లెలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని తో కలిసి కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, ఆర్డీఓ లు భాను ప్రకాష్ రెడ్డి, రామ్మోహన్, జిల్లా అధికారులు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.