గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో త్రాగునీటి పన్ను, మీటర్ల చార్జీలు చెల్లించని ట్యాప్ కనెక్షన్ లను తొలగించాలని, పన్ను వసూళ్లలో రాజీ లేదని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెవెన్యూ, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులతో పన్నుల వసూళ్లు, పారిశుధ్య పనులు, ఎన్పిసిఐ సర్వే, హౌస్ జియో ట్యాగ్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నీటి పన్ను బకాయిలు పెద్దఎత్తున పెండింగ్ లో ఉంటున్నాయని, నీటి పన్ను చెల్లించని నివాసాలకు, మీటర్ల చార్జీలు చెల్లించని కమర్షియల్ సంస్థల ట్యాప్ లను డిస్ కనెక్షన్ చేయాలని రెవెన్యూ అధికారులను, ట్యాప్ ల డిస్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా ఆర్.ఓ.ల వారీగా ఫిట్టర్లని కేటాయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పన్ను వసూళ్లలో సమన్వయం చేసుకోవాలని, పన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అనంతరం ప్రజారోగ్య విభాగ సమీక్ష చేసి, ప్రత్యేక అధికారులు ప్రతి రోజు మస్టర్ కి వెళ్లి మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా పని తీరు మార్చుకోవాలని, తమ డివిజన్లో జివిబిలు లేకుండా భాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్పిసిఐ, ఇళ్ళ జియో ట్యాగ్ లను సమీక్షించి, బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు ఒక్కో నోడల్ ప్రాంతంలో నేరుగా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ఓ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ రవిబాబు, ఈఈ సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, ప్రత్యేక అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …