Breaking News

భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాజ్యాంగమనేది ఒక దిక్సూచి లాంటిదని.. కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వందేళ్ల ముందు చూపుతో ఓ బలమైన రాజ్యాంగాన్ని రూపొందించారని వెల్లడించారు. ఆ మహనీయుని కృషి ఫలితంగానే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ వివరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ‘రాజ్యాంగ వ్యతిరేక పాలన’ నడుస్తోంది
రాష్ట్రంలో గత 6 నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగిస్తూ.. పౌరుల కనీస హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. సంక్షేమ రాజ్యం నెలకొల్పుతామని మాయ మాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక కక్షలు, ప్రతీకారాలతో ప్రజల హక్కులను హరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టికల్ 19 కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు సైతం రక్షణ కరువైందన్నారు. ఇచ్చిన హామీలకు శాసనసభ సమావేశాలలో బడ్జెట్ కేటాయింపులు చేయవలసిందిపోయి.. సోషల్ మీడియా గొంతు నొక్కేవిధంగా కఠినమైన చట్టాలు రూపొందించడం సిగ్గుచేటన్నారు. ఇదేనా భారత రాజ్యాంగానికి మీరిచ్చే గౌరవమని సూటిగా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో వైఫల్యం, ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోవడం, సోషల్ మీడియా గొంతు నొక్కడం, ప్రశ్నించే పౌరులపై తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ప్రతి చోటా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పిన ప్రభుత్వం.. అంబేద్కర్ స్మృతివనంపైన మాత్రం ఎందుకంత ఈర్ష్య, ద్వేషమని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కేవలం గత ప్రభుత్వంలో ప్రారంభమయిందనే ఒకే ఒక్క కారణంతో.. భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకోకుండా వివక్షగా వ్యవహరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజలందరితో కలిసికట్టుగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందన్నారు. వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. కనుక భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, కాళ్ల ఆదినారాయణ, కంభం కొండలరావు, మేడా రమేష్, అక్బర్, ఆర్.ఎస్.నాయుడు, నాగుల్ మీరా, శ్యామ్, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణిరెడ్డి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *