-ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉన్న ఆర్దిక ఇబ్బందులపై దృష్టి
-డిసెంబర్ మొదటి వారంలో సిఎం పోలవరం పర్యటన
-సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు పనులకు సంబందించి ఏరోజు ఎంత పని జరిగింది,అని ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు వీలుగా వెబ్సైట్ రూపొందించి,పనుల వివరాలు ఆ వెబ్ సైట్ లో నమోదుచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. డిసెంబర్ మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టు ను సందర్శించి డయా ఫ్రం వాల్,ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులకు సంబందించిన షెడ్యూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.సచివాలయంలో బుదవారం ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రం వాల్ నిర్మాణం,ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులకు సంబందించి ప్రాజెక్ట్ అధికారులు,కాంట్రాక్ట్ ఏజెన్సీ తయారు చేసిన వర్క్ షెడ్యూల్ పై సమీక్ష నిర్వహించారు.డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలనే దానిపై చర్చించారు.దీనితో పాటు ప్రాజెక్టులో కుడి,ఎడమ కాలువలను కలిపే సొరంగాల నిర్మాణాల్లో మిగిలిన తవ్వకం పనులు, అదేవిధంగా లైనింగ్ పనులను వెంటనే మొదలు పెట్టి, నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఇంక పోలవరం ఎడమ కాలువ పనులకు సంబందించిన మిగిలిన పనులను పూర్తి చేయడానికి వీలుగా ఇప్పటికే టెండర్లు పూర్తవ్వగా , వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.భూసేకరణ,పునరావాసం,నిర్వాసితులకు అందించాల్సిన నష్టపరిహారంకు సంబందించిన వివారాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డిసెంబర్ 8వ తేదీన జరిగే సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఇందుకోసం రెవిన్యూ,ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.సాగు నీటి సంఘాల ద్వారా కాలువలు,డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం తో పాటు వారికి ప్రాతినిధ్యం లభిస్తుందని మంత్రి తెలిపారు.
వీటితో పాటు హంద్రీ-నీవా,వెలిగొండ,చింతలపూడి,గోదావరి పెన్నా నదుల అనుసంధానం,బుడమేరు,ఐడిసి రిపేర్లు,ఇరిగేషన్ లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు,గోదావరి డెల్టా డిపిఆర్ లపై సంబందిత అధికారులు,కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్,కడ కమిషనర్ రాంసుందరరెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు,పోలవరం సిఈ నరసింహమూర్తి తో పాటు పలు ప్రాజెక్టుల సిఈలు,ఎస్ఈలు,కాంట్రాక్ట్ ఎజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.