-వైద్య విద్యా బోధనలో ప్రమాణాల్ని పెంచాలి
-వైద్య విద్యార్థుల హాజరు శాతంపై ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలి
-సమర్ధులైన వైద్యుల్ని సమాజానికి అందించాలి
-కళాశాలకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ లపై శ్రద్ధ పెట్టకపోవడం పట్ల మంత్రి ఆవేదన
-ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో వర్చువల్‌గా వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య విద్యా బోధనలో ప్రమాణాలు పెంచడం ద్వారా సమర్ధులైన డాక్టర్లను సమాజానికి అందించినవారవుతారని, ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాణాల్ని పాటించడం ద్వారా, ఇక్కడ చదివిన వైద్య విద్యార్థులు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచినవారవుతారన్నారు. వైద్య విద్యార్థుల హాజరు శాతంపై ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టిని సారించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం నాడు వెలగపూడి ఏపీ సచివాలయం నుంచి ఆయన వర్చువల్‌గా సమీక్షించారు.
వైద్య కళాశాలల్లో బోధకుల హాజరు శాతం కూడా పక్కాగా ఉంటేనే సమర్ధులైన వైద్యులను సమాజానికి అందించగలుగుతారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. మిగతా విద్యార్థులతో వైద్య విద్యార్థుల్ని పోల్చలేమని, మెరుగైన ఆరోగ్య సంరక్షణలో వీరు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. మన రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయో అంచనా వేసుకోవడం ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామనే విషయం అవగతమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చే ఎన్ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ (National Institutional Ranking Framework-NIRF) సాధించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని, ర్యాంకింగ్ పొందడం వల్ల వైద్య కళాశాలల ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ర్యాంకింగ్ పట్ల వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు దృష్టిపెట్టకపోవడం ఆశ్ఛర్యాన్ని కలిగిస్తోందని మంత్రి ఆవేదన వెలిబుచ్చారు. ఎన్‌ఏబీహెచ్ అక్రిడిటేషన్ పొందేందుకు కూడా కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌కు పరిశోధన సంబంధింత వ్యాసాలను పంపించాలని, పరిశోధనా విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో 40 మెడికల్ కాలేజీలుండగా, దాదాపు 6500 మంది వైద్య విద్యార్థులున్నారని; క్లినికల్, నాన్ క్లనికల్ విభాగాల్లో దాదాపు 3000 మంది పీజీ విద్యార్థులున్నారని మంత్రి పేర్కొన్నారు.
వైద్య విద్య కళాశాల పనితీరుపై ఆరా తీసిన మంత్రి, వైద్య విద్య బోధన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ప్రిన్సిపాళ్లను మొత్తం 17 ప్రశ్నలు అడిగారు. వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు తక్షణం ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన 5 పనుల గురించి చెప్పాలని కోరారు. వైద్య కళాశాలలపై ప్రజల్లో ఇప్పటికీ విశ్వాసం ఉందన్న సత్యకుమార్ యాదవ్, ప్రజల అంచనాలకు తగ్గట్లుగా అన్ని వైద్య కళాశాలల్లో వైద్య సేవలు అందాలని నిర్దేశించారు. వైద్యులు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతారని చెప్పిన మంత్రి, నాణ్యత లేని వైద్యులను, వైద్య సేవలను ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.
మన రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతపై ఎప్పుడైనా మదింపు జరిగిందా అని అడిగిన సత్యకుమార్ యాదవ్, ఆ మదింపులో కనుగొన్న విషయాలు ఏమిటని ప్రిన్సిపాళ్లను ప్రశ్నించారు. వైద్య విద్య నాణ్యత మెరుగుదల కోసం ఇటీవలి సంవత్సరాల్లో తీసుకున్న చర్యలపైనా మంత్రి ఆరా తీశారు. ఒకవేళ మన రాష్ట్రంలో వైద్య విద్యకు 1 నుంచి 10 వరకు రేటింగ్ ఇవ్వాల్సివస్తే, ఏ నంబర్ ఇవ్వొచ్చని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశంలో, దేశవ్యాప్తంగా మనం వైద్య విద్యకు ఎలాంటి రేటింగ్ ఇవ్వొచ్చని అడిగారు. ఆల్ ఇండియా ర్యాంక్‌లలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్ర మెడికల్ కాలేజీలు గురించి అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకుల నైపుణ్యాలు, కళాశాలల్లోని బోధన సామగ్రిని అప్‌గ్రేడ్ చేయడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి ప్రిన్సిపాళ్లను ప్రశ్నించారు. వైద్య వృత్తిని భారీగా డబ్బు సంపాదించే సాధనంగా చూసే బదులు, నైతికత & సేవా భావాన్ని ప్రోత్సహించేలా సిలబస్ సమగ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. యూనివర్శిటీ పరీక్షల గురించి కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ అడిగారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, డిఎంఇ డాక్టర్ నరసింహం సమావేశంలో పాల్గొన్నారు