-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే వర్థంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆ మహనీయుని విగ్రహానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీశైలజారెడ్డితో కలిసి పూలమాలలు వేసి గురువారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మ పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుబడిన దీనజన బాంధవుడు జ్యోతిరావు పూలే అని కీర్తించారు. 19వ శతాబ్ధపు గొప్ప సంఘసంస్కర్తలలో అగ్రగణ్యులని.. సామాజిక సమానత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడని కొనియాడారు. కులవివక్షని ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన దానిని రూపుమాపేందుకు తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు ప్రత్యక్ష అనుభవాలతో నిండి ఉండేవని చెప్పుకొచ్చారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్త్రీలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి అని కొనియాడారు. కనుకనే పూలేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడ్డాయన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి యేసు, కురిటి శివ, పేరం త్రివేణి రెడ్డి, శ్యామ్, ఆర్. ఎస్. నాయుడు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.