మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) చైర్మన్ గా మట్టా ప్రసాద్ గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముడ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో ముడా చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల మచిలీపట్నం నగర అభివృద్ధిలో, పోర్టు అభివృద్ధిలో ముడ పాత్ర గణనీయమైనదని, చేపట్టిన పదవి బాధ్యతగా నిర్వర్తించి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ముడా చైర్మన్ ను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడుతూ బందరు పోర్టు కోసం ముడా ద్వారా భూములు సేకరించిన విషయం గుర్తు చేశారు. పోర్టు అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలే మారనున్నాయని, జిల్లా అభివృద్ధిలో ముడా ప్రధాన పాత్ర వహిస్తుందని అన్నారు.
కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, కూటమి పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముడా చైర్మన్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో కూటమి నాయకుల అండతో ముడా చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా బాధ్యతగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని, బందరు పోర్టు అభివృద్ధి ద్వారా జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. తన పదవి స్వీకార కార్యక్రమానికి హాజరైన
మంత్రివర్యులు పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.