–కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా చూస్తాం
–6వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో 6వ డివిజన్‌లో గులామోయిద్ధీన్ నగర్, ముత్యాలమ్మ గుడి, పాత వాటర్ ట్యాంక్, వీరన్న వీధి, మారుతీ నగర్ పాత పోలీస్ స్టేషన్ రోడ్ చైతన్య కాలేజ్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా నివాసితులను అడిగి తెలుసుకున్నారు. పుట్ట రోడ్డు దగ్గర రిటైనింగ్ వాల్, సైడు కాలువలు, విద్యుత్ స్తంభాలు, అండర్ గ్రౌండ్ డైనేజీ, మెట్ల సమస్యలపై అధికారుల తో చర్చించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎంత నిధులు అవుతాయో అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో సమస్యలను అన్నింటిని మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళానని చెప్పారు. నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలలో ప్రతి ఇంటికి రోజుకి కనీసం రెండు గంటలైనా తాగునీరు అందించాలని కోరానని చెప్పారు. నియోజకవర్గంలో కొండ రాళ్ళు దోర్లి పడిన సంఘటనల్లో 96 కుటుంబాలకు సహాయం అందించాలని తెలియజేశానన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటిని తాను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళానని సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గతంలో టీడీపీ కమ్యూనిస్టు పార్టీల హాయంలో మెట్లు, తాగు నీరు, రోడ్లు, ర్యాంపులు నిర్మాణం చేశామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మెట్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయని వాటిని మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఆ పనులు మొదలు పెట్టి పూర్తి చేస్తామని అన్నారు. నగరంలోని అన్ని సమస్యలను 2026–27 సంవత్సరం నాటికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారన్నారు. దానికి ప్రజల నుంచి కూడా సహాకారం అందించాలన్నారు. సంక్షేమాన్ని,అభివృద్థిని సమానంగా ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు.
టీడీపీ ఆరో డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ డివిజన్‌లోని సమస్యలను స్వయంగా తెల్సుకోడానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ డివిజన్‌లో పర్యటించారన్నారు. గులామెయిద్ధీన్ నగర్‌లో డ్రైనేజీ సమస్యను ఆయన స్వయంగా పరిశీలించారని చెప్పారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రతి వీధీల్లో తిరిగి సమస్యలను గుర్తించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని చెప్పామని, అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటిస్తున్నారన్నారు. గులామెయిద్ధీన్ నగర్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి ఆలస్యం అయితే తన సొంత నిధులతో పనులు పూర్తిచేయిస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజలకు అండగా ఉంటున్నారని గంగాధర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో గన్నే ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, పల్లి దుర్గాప్రసాద్, పునుగుపాటి మోహనరావు, వడ్డేపల్లి కేశవ్, వనుము దుర్గారావు, సగరపు అప్పారావు, కందివలస అచ్చిత, షేక్ షకీల, కనక శివ, బల్లెపు దుర్గారావు, గద్దె రమేష్. కార్పోరేషన్ ఇ. ఇ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.