-ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి నష్టపోయిన రైతుల ఆదాయ స్థిరీకరణకు భరోసా.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకం
-పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడి నష్టపోయిన సందర్భంలో రైతుకు భరోసా కల్పించేలా వ్యవసాయ ఆదాయ స్థిరీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)ను అమలుచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి పీఎంఎఫ్‌బీవైపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లాస్థాయి జాయింట్ కమిటీ, సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటల బీమా పథకం (రబీ 2024-25) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రృకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడికి నష్టం వాటిల్లిన సందర్భంలో రైతుకు భరోసా కల్పించేలా వ్యవసాయ ఆదాయ స్థిరీకరణకు, రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉపయోగపడుతుందన్నారు. ఈ పంటల బీమా పథకాన్ని రైతులకు ఐచ్ఛికంగా వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో పథకం ద్వారా పూర్తి ప్రయోజనం పొందే విషయమై రైతులకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని, దిగుబడి ఆధారిత పథకం అమలు విధివిధానాలు, ఎంపిక చేసిన పంటలు, బీమా యూనిట్లు, ప్రీమియం రేట్లు, బీమా మొత్తం, పరిహారాన్ని లెక్కించే విధానం తదితర అంశాలను వివరించాలని అధికారులకు సూచించారు. రబీకి సంబంధించి పథకం అమలు కార్యాచరణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఎన్‌టీఆర్ జిల్లాలో పథకం అమలుకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహరిస్తోందని వివరించారు. జిల్లాకు సంబంధించి వరికి గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్నకు మండలం యూనిట్‌గా, శెనగలకు జిల్లా యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందన్నారు. వరి, మొక్కజొన్నలకు ఎకరాకు రూ. 42 వేలు బీమా మొత్తానికి రూ. 126 ప్రీమియం, శెనగలకు ఎకరాకు రూ. 28 వేలు బీమా మొత్తానికి రూ. 56 ప్రీమియం రైతులు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ పథకంలో చేరేందుకు వరికి డిసెంబర్ 31లోగా, మొక్కజొన్న, శెనగలకు డిసెంబర్ 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు వివరించారు. పంట రుణం తీసుకుంటే సంబంధిత బ్యాంకు నేరుగా బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుందని.. రుణం తీసుకోని రైతులు మాత్రం ప్రీమియంను సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ తదితర మార్గాల ద్వారా చెల్లించవచ్చన్నారు. ఈ విషయంలో గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎస్‌సీఐపీ) ద్వారా నేరుగా వెబ్‌సైట్లో/మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. పథకానికి సంబంధించి పూర్తివివరాలకు రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులను సంప్రదించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. అధికారులు, రైతులతో కలిసి ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయంలో వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్ల యాజమాన్య దీపికలను ఆవిష్కరించారు.
సమావేశంలో ప్రగతిశీల రైతులు శీలంనేని సాంబశివరావు, ఉప్పుగుoడ్ల మాధవరావు, జిల్లా ఇన్‌ఛార్జ్ వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, సీపీవో వై.శ్రీలత, గరికపాడు కేవీకే శాస్త్రవేత్త శివప్రసాద్, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ కృష్ణప్రసాద్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి యు.సతీష్ తదితరులు పాల్గొన్నారు.