-రూల్ నెంబర్ 377లో లెవనెత్తిన ఎన్.హెచ్.ఎమ్ ద్వారా నిధుల మంజూరు అంశం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) అదనంగా పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య/ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు , శిశువులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, ఇతర మౌళిక సౌకర్యాల పెంపు, వాటికి కావాల్సిన నిధులను నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా మంజూరు చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ గురువారం లోక్ సభలో రూల్ 377 కింద ఈ అంశం లేవనెత్తారు
నవంబర్ 5వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన దిశ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ తో జరిపిన సమీక్షాలో ఈ విషయాలు గుర్తించినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ లో గల ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిధిలో మొత్తం జనాభా సంఖ్య 11,35,129 వుండగా, ఇందులో గర్భిణీ స్త్రీల సంఖ్య 17,624, శిశువుల నమోదు 15,247గా ఉంది. ఈ ఆసుపత్రుల్లో ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు (Institutional Deliveries) సురక్షితంగా, సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు వంద శాతం మెరుగైన సేవలను అందించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ అంశాన్ని త్వరితగతిన ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.