– జిల్లాలో 2,31,127 పెన్షన్లకు రూ. 97.93 కోట్లు విడుదల
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందురోజే నవంబర్ 30న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌డీఏ పీడీ, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే సరిదిద్ది ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని.. జిల్లాలో 2,31,127 పెన్షన్లకు రూ. 97.93 కోట్లు మేర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సామాజిక భద్రతను పెంచే ఉద్దేశంతో పెన్షన్ల పంపిణీని మరింత సరళీకృతం చేసిందన్నారు. వివిధ కారణాల వల్ల రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అతని భార్య మరుసటి నెల నుంచే స్పౌజ్ పెన్షన్ (వితంతు పెన్షన్) పొందేలా వీలుకల్పించినట్లు వివరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.