-కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు
-వ్యాధి బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సురక్షిత కృష్ణా జలాలను రానున్న జూన్ నాటికి అందించేలా తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని, కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధుల బారిన పడిన బాధితులకు ప్రత్యేక వైద్య సహాయం అందించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఎ.కొండూరు, పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 కోట్లతో రెడ్డిగూడెం మండలం కుదప వద్ద జరుగుతున్న రక్షిత తాగునీటి రిజర్వాయర్, పైపులైన్ల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా అధికారులతో కలిసి పరిశీలించారు.
పనుల ప్రగతిపై అధికారులకు సూచనలు చేసి, అనంతరం ఎ.కొండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మినీ డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన కృష్ణా జలాలను అందించేందుకు రెడ్డిగూడెం మండలం, కుదప గ్రామం వద్ద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ రిజర్వాయర్ పనులు పూర్తిచేయడం జరిగిందని.. ఇందుకు సంబంధించి దాదాపు 200 కి.మీ. మీటర్ల మేర పైపులైన్ల పనులలో ఇప్పటికే 90 కి.మీ. మేర పూర్తయ్యాయని, మరో 22 కి.మీ. పనులు తది దశకు చేరుకున్నాయని వివరించారు.
ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులకు అదనంగా మరో 14 ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆయా పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యంలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి పర్యటనగా రెడ్డిగూడెం, ఎ.కొండూరు మండలాల్లో పర్యటించి నిరుపేదలైన తండావాసుల స్థితిగతులను పరిశీలించి, వారికి మరింత మెరుగైన సహకారాన్ని అందించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటుచేసిన మినీ డయాలసిస్ కేంద్రాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సంతృప్తికరమైన వైద్య సహాయం అందించేందుకు కృషిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించామన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయని మరింత మెరుగైన సేవలందించేలా ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎ.కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది అంకితభావంతో పారదర్శకమైన సేవలందించి నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కలెక్టర్ వెంట స్థానిక ఆర్‌డీవో కె.మాధురి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో పి.లావణ్య కుమారి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.