Breaking News

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు

-అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు
-మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తాం
-పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి
-కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నార’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు… భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా?’ అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. శుక్రవారం కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో రేషన్ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రితో నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కాకినాడ పోర్టు అంటే స్మగ్లర్లకు స్వర్గధామంగా మారిపోయింది. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి అని చెబుతున్నా క్షేత్ర స్థాయి అధికారులకి ఇంకా మెతగ్గా ఉంటున్నారు. స్మగింగ్ చేసేవాడు ఒక్క బియ్యంతో ఆగడు. మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలను కూడా స్మగ్లింగ్ చేస్తాడు. రాజకీయ ఒత్తిళ్లు అని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అది దేశ భద్రతకే పెనుముప్పు గా మారుతుంది.

ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు వచ్చి ఆపాలా..?
కాకినాడ చుట్టు పక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులను రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే. ప్రతిసారీ ప్రజాప్రతినిధులు వస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారా..? రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న శక్తులపై కేసులు నమోదు చేయండి. దీని వెనుక ఉన్నది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలి.

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చేశారు
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొంత మంది అక్రమార్కులు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌ డౌన్‌ చేస్తాం. రేషన్‌ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలి. ప్రైవేట్ పోర్టు అయితే ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారేమో? కూటమి పాలనలో అటువంటివి కుదరవు. నేను వస్తున్నాను అంటే ఎస్పీ సెలవు మీద వెళ్లిపోయారు.
రేషన్ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో… ఇంకేదైనా జరుగుతున్నాయో ఎవరికి తెలుసు? ఇక్కడ నుంచి ఎంత గంజాయ్ బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్రమార్కులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాలి. షిప్ సీజ్ చేసి… దీని వెనుక ఉన్నదెవరు నివేదిక ఇవ్వాల”ని అధికారులను ఆదేశించారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *