-ఎంపీ కేశినేని శివ నాథ్
-శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి పై సమీక్షా సమావేశం
-దేవాలయం మాస్టర్ ప్లాన్ పనుల పై చర్చించిన మంత్రి ఆనం, ఎంపి కేశినేని
-ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలికిన ఈవో రామారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతి పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే వందేళ్లకు సరిపడా భక్తుల అవసరాలు తీర్చే విధంగా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.
ఇంద్రకీలాద్రి పై మహమండపం 7 వ అంతస్తు నందలి కార్యాలయం నందు ఆదివారం జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనుల పై సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. వీరిరువురికి ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దేవస్థానం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ మాస్టర్ ప్లాన్ వివరాలు తెలిపారు. మంత్రి ఆనం, ఎంపి కేశినేని శివనాథ్ పర్యాటక , ఆలయ అధికారులుతో మాస్టర్ ప్లాన్ ,కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ తో పాటు పలు అంశాల పై చర్చించారు.
ఈ సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్దికి సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఆలయ అధికారులు, టూరిజం అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకం ప్రసాద్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అభివృద్ది జరగాలన్నారు. భక్తుల సౌకర్యాలు, సదుపాయాల విషయంలో తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత ఏర్పాట్లు చేసే విధంగా కృషి చేయాలన్నారు. తిరుమలలో భక్తులకు వెయింటింగ్ హాల్స్,కాటేజీలు నిర్మించినట్లు ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రసాద్ పథకం ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేయించుకునేందుకు ఎండోమెంట్, టూరిజం అధికారులు ఎంపి కేశినేని శివనాథ్ సేవలు ఉపయోగించుకోవాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎండోమెంట్, టూరిజం అధికారుల సమన్వయంతో పనిచేసి కేంద్రానికి నివేదిక త్వరగా పంపించాలని ఆదేశించారు. ప్రసాద్ పథకం కోసం పంపించే నివేదిక లో భక్తులకు కావాల్సిన ప్రతిపాదనలు కూడా వుండాలని సూచించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆలయం అభివృద్ది చేయటానికి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ది కోసం ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ది కోసం మొత్తం డి.పి.ఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకి తీసుకువెళ్లి వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటామన్నారు. వారి సహకారంతో ఆలయ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి ఆధ్వర్యంలో ఆలయ మాస్టర్ ప్లాన్ మార్పులపై ఆలోచన చేసినట్లు చెప్పారు. కనకదుర్గమ్మ ఆలయం ప్రతిష్ట , ఆలయ పవిత్రతను దెబ్బతినకుండా కాపాడే విధంగా అధికారులతో పాటు భక్తులు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ , దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్ శేఖర్ గారు, ఆలయ ఈ ఈ లు కె వి ఎస్ కోటేశ్వర రావు, టి. వైకుంఠ రావు , టూరిజం శాఖ ఈఈ, టెక్నికల్ కమిటీ మెంబర్ పాండురంగ రావు , డి ఈ ఈ లు, ఏఈఈలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.