Breaking News

విద్యుత్‌ ఒప్పందాల రద్దు కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి

-కూటమి ఎమ్మెల్యేలు తీర్మానించాలి
-సెకీతో ఒప్పందంతో ప్రజలపై లక్షా 10వేల కోట్ల భారం
-ప్రజలపై భారాలు యనమల గుర్తెరగాలి
-ఆదానీకి దోచిపెట్టిన జగన్‌
-రైతులు, వలంటీర్లకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి
-విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని, దాని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో తీర్మానించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, పి.హరనాథరెడ్డిలతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్‌ ఒప్పందాల రద్దుపై తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని రామకృష్ణ వెల్లడిరచారు. విద్యుత్‌ ఒప్పందాలతోపాటు వివిధ అంశాలపై అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లల్లో పరిపాలనను చక్కదిద్దుతామని చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ లేఖలో మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ లేఖపైన ప్రభుత్వం స్పందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలు, ఇతర అంశాలను ఏ మాత్రం టచ్‌ చేయకుండా, కేవలం మాజీ సీఎం జగన్‌పై రూ.1750 కోట్ల అవినీతి ఆరోపణలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల్ని త్రోసిపుచ్చారు. విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్న దానిపై ఎవరున్నప్పటికీ..తప్పకుండా విచారణ జరిపించాల్సిందేనని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలపైన లక్షా 10 వేల కోట్ల భారం పడబోతుంటే..దానిని టచ్‌ చేయవద్దంటూ అని ఎవరైనా చెప్పారా? అని యనమలను సూటిగా ప్రశ్నించారు. అంటే ఈ భారాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా ఉన్నారని, మీరు భావిస్తున్నారా? అయన నిలదీశారు. ఏ ప్రజలు యనమలకు చెప్పారో మాకైతే అర్థం కావడం లేదన్నారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో సెకీ ద్వారా జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో ప్రజలపై భారం పడిరదన్నారు. పైపెచ్చూ విద్యుదుత్పత్తిని అంతా రాజస్థాన్‌లోనే కొనసాగడం వల్ల.. ఆ రాష్ట్రానికే అన్ని విధాలా లాభం జరుగుతోందన్నారు. దాదాపు 14వేల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయని, భూములిచ్చిన వారికి 30 ఏళ్లపాటు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని వివరించారు. ఒక వైపు రాజస్థాన్‌కు అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ, భారం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై వేయడం దుర్మార్గమన్నారు. ఎన్టీపీఎస్‌ ద్వారా గుజరాత్‌ ప్రభుత్వం రూ.1.99 పైసలకు కొనుగోలు చేసిందని, సెకీ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2.49 పైసలకు కుదుర్చుకుందని, ఒక యూనిట్‌కు అదనంగా 50 పైసలు నిర్ధారించి, 25 ఏళ్లపాటు ప్రజలపై పెనుభారం మోపనున్నారని చెప్పారు. ప్రజలపై భారాలు పడుతుంటే..దాని గురించి ఎవ్వరూ మాట్లాడవద్దనే తరహా ప్రభుత్వం ఉండటం తగదని, ఇంతకంటే అన్యాయం ఉండదన్నారు. కృష్ణపట్నం పోర్టును నవయుగ నుంచి తప్పించి, బెదిరించి జగన్‌ హయాంలో ఆదానీకి అప్పగించారని గుర్తుచేశారు. గంగవరం పోర్టునూ ప్రభుత్వానికి రావాల్సి ఉండగా, అతి తక్కువ ధరకు దానిని కూడా కట్టబెట్టారని మండిపడ్డారు. అదానీ కోసం వేలాది ఎకరాల భూములు ధారాదత్తం చేశారన్నారు. అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, విద్యుత్‌ ఒప్పందాల్ని రద్దు చేసుకునేందుకుగాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో 164 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు.
బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి మాట్లాడుతూ ఆదానీకి, బీజేపీకి సంబంధంలేదంటూ చేసిన వ్యాఖ్యల్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఇవాళ నరేంద్ర మోదీ, అమిత్‌షా లేకపోతే ఆదానీ లేడని నొక్కిచెప్పారు. నేడు ఆదానీ విద్యుత్‌ ఒప్పందాల అవినీతిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, అమెరికాలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ దర్యాప్తు పూర్తయ్యాకనే నివేదికను సమర్పించారని గుర్తుచేశారు. ఆ నివేదికలో ఆదానీ రూ.2100 కోట్లు 4 రాష్ట్రాలలో లంచాలుగా ముట్టజెప్పారని, అందులో రూ.1750 కోట్లను ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇచ్చినట్లుగా నివేదించారని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉంటే, ఆదానితో బిజెపికి సంబంధం లేదని పురంధరేశ్వరి అనడం తగదని సూచించారు. అటు జగన్‌ సైతం ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల చొప్పున పరువు నష్టం వేసి ఊరుకున్నారని, ఈ వార్తను ఆ రెండు పేపర్లే రాశాయా? అని ప్రశ్నించారు. దేశ, విదేశాల్లో ఉన్న మీడియా సంస్థలు జగన్‌పై కథనాలు రాశాయని, వాటిపైనా కూడా పరువు నష్టం వేయాలికదా అని అన్నారు. రాష్ట్రంలో ఆదానికి భయపడి రాజకీయం నడుస్తోందని, ఆదానీకి సరెండర్‌ అవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడతారా?, లేక ఆదానికి దోచిపెడతారా? తేల్చుకోవాలని సూచించారు. ఇప్పటికే జగన్‌ ఆదానికి దోచిపెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చాక కూడా గత ప్రభుత్వం తరహాగా ఉంటే, ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. దీంతోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించి, ఆదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో పరిపాలన నిష్ఫక్షపాతంగా జరగడంలేదని, కాకినాడ పోర్టుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెళ్లి అక్కడి షిప్‌ను సీజ్‌ చేయమని ఆదేశించడం చాలా సంతోషమన్నారు. కొంతకాలంగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదని, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అదే సమయంలో గంగవరం పోర్టులోనూ ఇదే కొనసాగుతున్నదనీ, అక్కడికి పవన్‌ కల్యాణ్‌ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది ఆదానీదనే వెనక్కి జంకుతున్నారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అరబిందోది కాబట్టే చర్యలకు ఉపక్రమించినట్లున్నదనీ, దీని వలన పాలన నిష్పక్షపాతంగా లేదనేదీ తేటతెల్లమవుతుందని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, తుఫాన్లతో ఇబ్బందులకు గురవుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. కనీసం రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవసరమైన టార్పాయిన్లు ఇవ్వడం లేదని, ధాన్యం వర్షంతో తడచి ముద్దవుతోందని చెప్పారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, ఈ అంశాలపై సీఎం చంద్రబాబును, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు. మేనిఫెస్టోలో రైతులకు హామీ ఇచ్చిన రూ.20వేలు ఇవ్వలేదని, కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు రూ.10వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా..అంత ఇవ్వలేకపోతే ప్రస్తుతానికి రూ.5వేల గౌరవ వేతనం ఇచ్చి వలంటీర్లను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఒక వైపు రూ.4వేల పెన్షన్‌ను ఇస్తూ, మరోవైపు రూ.5వేలతో వలంటీర్లను కొనసాగించకపోవడం బాధాకరమని, వలంటీర్ల విషయంలో రాజకీయం తగదని, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *