మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన” పథకం రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మంచి పథకమని, ప్రీమియం చాలా తక్కువ, రైతులకు పంట నష్టం జరిగినప్పుడు భీమా మొత్తం రైతులకు అందుతుందని, పథకం ప్రయోజనాలు రైతులకు వివరించి ఆసక్తి గల రైతులందరిని నమోదు చేయాలన్నారు. రబీలో పంట రుణాలు పొందిన రైతుల నుండి ప్రీమియం కట్టించుకోవడం జరుగుతుందని, అదేవిధంగా రుణాలు తీసుకోని రైతులు కూడా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీమియం వివరాలు కలెక్టర్ తెలియజేస్తూ రబీలో ప్రతి ఎకరాకు ప్రీమియం మినుము 80 రూపాయలు, జొన్న, ధాన్యం 84 రూపాయలు, పెసలు 36 రూపాయలు మాత్రమే అన్నారు. జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువమంది ఈ పథకం వినియోగించుకునేలా చూడాలన్నారు. పథకం ప్రయోజనాలపై బ్రోచర్ విడుదల చేసిన కలెక్టర్
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రయోజనాలు వివరిస్తూ వ్యవసాయ శాఖ ముద్రించిన బ్రోచర్ కలెక్టర్ ఈ సమావేశంలో విడుదల చేశారు. అన్ని గ్రామ వార్డు సచివాలయాలు (సిటిజన్ సర్వీస్ సెంటర్) పౌర సేవలు అందిస్తున్నందున బీమా ప్రీమియం సచివాలయాల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, కే డి సి సి బ్యాంక్ సీఈవో ఏ శ్యామ్ మనోహర్, ఎల్ డి ఎం సి రవీంద్రారెడ్డి, సిటిజన్ సర్వీస్ సెంటర్ రాష్ట్ర మేనేజర్ పి రాజాబాబు, సిపిఓ గణేష్ కృష్ణ, ఉద్యాన శాఖ అధికారిని మానస, భీమ కంపెనీ ప్రతినిధి మహేష్, కమిటీలో రైతు ప్రతినిధులు కాగిత వెంకటేశ్వరరావు, పి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.