మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ, రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహసిల్దార్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం (ఆర్.ఎస్.కె) నుంచి అనుమతి లేకుండా ఒక్క ధాన్యం బస్తా కూడా మిల్లుకు వెళ్లడానికి వీల్లేదని, దీనిని ఉల్లంఘించినా లేదా దళారులను ప్రోత్సహించినా వెంటనే సంబంధిత అధికారి, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు దళారులను ప్రోత్సహిస్తూ తోడ్పాటు అందిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇంకొంతమంది వారే దళారులుగా అవతారమెత్తి లబ్ధి పొందుతున్నారన్న ఫిర్యాదులు అందాయని, అదే నిజమైతే అట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దళారులు ఎవరైన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిస్తే పైఅధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రైతు సేవ కేంద్రం వద్ద నమోదు చేసిన తేమ శాతమే తుది నిర్ణయమని, ఈ విషయంలో మిల్లుల వద్ద ఎలాంటి బేరాలు ఉండకూడదని, రైతుకు నష్టం వాటిల్లేల వ్యవహరించవద్దని కస్టోడియన్ అధికారులకు సూచించారు
ప్రస్తుతం యంత్రాల ద్వారా కోసిన పంట ఇంకా 1.2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించవలసి ఉన్నదని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ధాన్యం సేకరణలో ఒత్తిడిని తగ్గించేందుకు కోతలను వాయిదా వేసుకునేలా రైతులను అవగాహన పరచాలని సూచించారు. తద్వారా వారికి పూర్తి మద్దతు ధర లభించే అవకాశం ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ అధికారిణి వి పార్వతి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మ దేవి, జిల్లా సహకార అధికారి కే చంద్రశేఖర్, ఏడి మణిధర్ తదితరులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.