కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం, కానూరు గ్రామంలోని మురళీ రిసార్ట్స్ లో ఊర్జావీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గురువారం సాయంత్రం ఆయన కానూరులోని మురళి రిసార్ట్స్ లో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఊర్జావీర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో కలిసి లాంఛనంగా ప్రారంభిస్తారని, అధికారులందరూ సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధాన వేదిక ఏర్పాటు, ముఖ్యమంత్రితో పాటు ఇతర విఐపిలకు గ్రీన్ రూమ్ ల ఏర్పాటుపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులకు వివరించారు.
మురళి రిసార్ట్స్ ఆవరణలోనే విఐపి లకు పార్కింగ్ ఏర్పాటు, అదేవిధంగా సమీపంలోని నారాయణ కళాశాలలో ఇతరులకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆ వివరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రజానీకానికి తాగునీరు, స్నాక్స్ సరఫరా, రిసార్ట్స్లో మరుగుదొడ్ల సౌకర్యాన్ని తెలియజేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గంతో పాటు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టాలని, గుంతల రహిత రహదారుల (పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్) కార్యక్రమం ద్వారా రహదారులను అభివృద్ధి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలాషారోన్, ఏపీ జెన్కో డైరెక్టర్ సుజయ్, ఏపీ జెన్కో ఎలక్ట్రికల్ సేఫ్టీ చీఫ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యానందం, తాడిగడప మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.