కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం, కానూరు గ్రామంలోని మురళీ రిసార్ట్స్ లో ఊర్జావీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఏపీసిపిడిసిఎల్ సిఎండి పి రవి సుభాష్, ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి పరిశీలించారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయాలని, అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఎనర్జీ ఎఫిసియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో ఊర్జావీర్, అంగన్వాడి సెంటర్లకు ఇండక్షన్ వంట సామాగ్రి పంపిణీ, శక్తి సామర్థ్య ఉపకరణాలు (ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లియెన్సెస్) అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ తో కలిసి లాంఛనంగా ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలాషారోన్, ఏపీ జెన్కో డైరెక్టర్ సుజయ్, ఏపీ జెన్కో ఎలక్ట్రికల్ సేఫ్టీ చీఫ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యానందం, తాడిగడప మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు.