పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త :
జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పట్టుదల, కృషి కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. శనివారం ఉదయం పెనమలూరు మండలం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ సృజనాత్మకంగా తయారుచేసిన గ్రీటింగ్స్ ను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని ఆయన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించాలంటే ఉన్నత స్థానాలకు చేరిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పుట్టగానే ఎవరూ గొప్పవారుగా జన్మించరని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం తీవ్రమైన కృషి చేస్తే ఒక ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులుగా తయారవుతారన్నారు. విజయం అనేది సులువుగా దక్కేది కాదని, ఒకవేళ దక్కినా దానికి విలువ ఉండదన్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన, కసి వెంటాడుతూ ఉండాలని, అప్పుడే గొప్ప విజయాలను అందుకుంటారన్నారు. విద్యార్థులు తరగతి గదిలోని నోట్స్ కు పరిమితం కాకుండా టెక్స్ట్ బుక్స్ చదవడానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, తద్వారా సబ్జెక్టుపై పట్టు సాధించగలరని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, ఉయ్యూరు గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఐ పద్మరాణి, ఎంపీడీవో ప్రణవి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.