-కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 14 లేదా 15న మరో అల్పపీడనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగ్నేయ బంగాళాఖాతం-హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో అలలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ మోడల్ సూచిస్తోంది. ఇది 16, 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలో కొద్దిరోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.