Breaking News

రైతు సేవ కేంద్రంలో నమోదైన తేమశాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్

ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సేవ కేంద్రాల్లో నమోదు చేసిన తేమ శాతం ఫైనల్, రైతులు ఆందోళన చెందవద్దు, మధ్య దళారులను నివారించి, ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధరలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు తెలిపారు. కలెక్టర్ ఆదివారం ఘంటసాల మండలం మాజేరు, లంకపల్లి, పూషడం, దేవరకోట తదితర గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులతో కూడా మాట్లాడి తేమ శాతం ఎంత? బస్తా కు ఎంత డబ్బు వచ్చింది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మాజేరు, లంకపల్లి గ్రామాల్లో ప్రధాన రహదారి వెంబడి ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూషణం గ్రామంలో ధాన్యం అమ్మిన రైతులు భీమ సురేష్, బీమా బాలాజీ, చీదేపూడి వాలగిరి రాజు తదితరులతో కలెక్టర్ మాట్లాడి అమ్మినధాన్యానికి ఎంత డబ్బు వారి ఖాతాల్లో పడింది, బస్తా ఎంతకు అమ్మారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం విక్రయించినట్లు, అమ్మిన సమయంలో వర్షం కారణంగా తేమశాతం 27 నుండి 30 వరకు ఉండడంతో ఆమెరకు ధాన్యం విలువ తగ్గించి 75 కిలోల బస్తా 1500 వరకు వచ్చిందని, వారి ఖాతాల్లో జమైందని కలెక్టర్కు తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, వర్షం భయంతో వెంటనే అమ్మివేసామని కలెక్టర్కు వివరించారు.

దేవరకోట గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విక్రయాలపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేమూరి రత్నగిరి రావు తదితర రైతులు ధాన్యం సేకరణ సమస్యలు కలెక్టర్కు వివరించారు. కొన్ని రోజుల క్రితం వర్షం భయంతో ధాన్యం మధ్య దళారులకు విక్రయించామని, పచ్చి గింజ ఉన్నప్పటికీ తేమ శాతంతో సంబంధం లేకుండా బస్తాకు 1500 రూపాయలు లభించాయని తెలిపారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తున్నామని, అయితే ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బందిగా మారిందని రైతులు తెలిపారు. 1061 రకం ధాన్యంకు డిమాండ్ బాగా ఉందని, 1262 రకం దాన్యం గింజ పలుచన నూక అవుతుందని మిల్లర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. కూలీల సమస్య వల్ల రాబోయే రోజుల్లో డ్రైయర్లు ఏర్పాటు ఎక్కువగా చేయాలని ధాన్యం ఆరబెట్టే సమస్యకు ఇదే పరిష్కారమని రైతులు కలెక్టరుకు సూచించగా, రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అచ్చంపాలెం గ్రామంలో నాలుగేళ్లుగా ఈ క్రాప్ జరగలేదని సర్పంచి గాజుల నాగ శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, తగిన విచారణ జరపాలని, ఆ గ్రామంలో గత నాలుగేళ్లుగా ఈ క్రాప్ డేటాతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, ఏ డి మనిధర్, తాసిల్దారు బి విజయ ప్రసాద్ ,డిప్యూటీ తాసిల్దారు బి కనకదుర్గ, రైతు సేవ కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *