పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యతని, సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని శనివారం పోరంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి, వారి కుటుంబాలకు అండగా నిలిచే సంకల్పంతో 1949 సంవత్సరం నుంచి ఏటా డిసెంబర్ ఏడో తేదీన సాయిధ దళాల పతాక దినోత్సవాన్ని పాటిస్తున్నామని వివరించారు. పాకిస్తాన్, చెనైనాతో జరిగిన యుద్ధాలు, ముంబై తాజ్ హోటల్ పై దాడి వంటి ఘటనలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల ధైర్యసహసాలు, తెగువకు జాతి యావత్తు గర్విస్తోందన్నారు. వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం పతాక దినోత్సవం కల్పించిందన్నారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్న జవానులకు ప్రతి ఒక్కరూ వందనాలు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పతాక నిధికి విరాళాలు అందించే దాతలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని, స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకొచ్చేవారు ఎన్టీఆర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించొచ్చని సర్జన్ లెఫ్ట్నెంట్ కమాండర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి డాక్టర్ కే కళ్యాణ వీణ తెలిపారు. గత ఏడాది 2023లో కృష్ణాజిల్లా నుంచి సాయుధ దళాల పతాకనిధి రూ. 12,51,776 సేకరించినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, సైనిక సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, ఎన్ సీ సీ విద్యార్థులు పాల్గొన్నారు.