మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా భావించి సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, బందరు ఆర్డిఓ కే.స్వాతిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు. సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల వివరాలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
తన ధాన్యంతో పాటు తన కుమారుడికి చెందిన ధాన్యం మొత్తం 477 బస్తాలు మిల్లుకు వెళ్లకుండా కళ్లెం వద్దే ఉండిపోయాయని, దీనిపై అధికారులెవరూ పట్టించుకోవడంలేదని, ప్రస్తుత వాతావరణ మార్పులతో ఎంతో ఆందోళన చెందుతున్నానని, ధాన్యం మిల్లుకు చేరే విధంగా సహాయం చేయాలని ఉయ్యూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా ఓంకారం కలెక్టర్కు అర్జీ ద్వారా విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ధాన్యం తరలింపుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో అప్పటికప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడి ధాన్యం తరలింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తన కొడుకు మల్లా కొండ పుట్టుకతో పూర్తి దివ్యాంగుడని, ఒకరి సహాయం లేకుండా తన పనులు ఏవీ చేసుకోలేడని వివరిస్తూ ప్రస్తుతం రూ.6వేల పింఛను పొందుతున్నాడని, రూ.15 వేల పింఛను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇటీవల తన భర్త క్యాన్సర్ వ్యాధితో మరణించాడని, తనకు మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తన కొడుకు పరిస్థితి వల్ల ఎక్కడికీ వెళ్లి పనిచేసుకోలేని పరిస్థితి తనదని, తమపైన దయ చూపి కుమారుడికి పింఛను మంజూరు చేయాలని పెడన మండలం, పెడన పట్టణం పదవ వార్డుకు చెందిన మల్లా శాంతి అర్జీ సమర్పించారు.
మా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, మురుగు కాలువలు నిర్మించాలని గతంలో మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని, ఈ సమస్యతో కాలనీవాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని తాడిగడప తులసి నగర్ కు చెందిన డి నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
మరణించిన వారిని ఖననం చేయుటకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ అభ్యర్థనను పరిశీలించి స్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని కంకిపాడు మండలం, ఉప్పులూరు గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కే కన్నమనాయుడు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.