మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పని ప్రదేశాలలో మహిళలకు తగిన భద్రత వాతావరణం కల్పించి, వారిని గౌరవించడం కోసం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ చట్టంపై తగిన ప్రచారం అవగాహన కల్పించడం కోసం కలెక్టరేట్ లో ఈచట్టంలోని అంశాలపై ఏర్పాటుచేసిన డిస్ప్లే బోర్డ్ కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్ట ప్రకారం కార్యాలయాలు, కర్మాగారాలు, స్వయం ఉపాధి ప్రదేశాలలో 10 మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్నచోట్ల మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించే అంతర్గత కమిటీలు తప్పనిసరిగా వేయాలన్నారు. ఈ విధంగా జిల్లాలో 227 సంస్థలలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 10 మందికంటే తక్కువ ఉంటే, వారి కోసం జిల్లాలో జిల్లా స్థాయిలో స్థానిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ కమిటీల ముందు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వచ్చిన ఫిర్యాదులపై తగిన విచారణ జరిపి ఈ కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని, నివేదికలను బట్టి చట్ట ప్రకారం బాధ్యులకు జరిమానా, పరిహారం లేదా శిక్షలు అమలు చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు