-సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భూముల వర్గీకరణ పై నివేదిక అందజేయాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్రమణలకు సంబంధించిన భూముల గుర్తింపు, సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరు ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి పట్టణ ప్రాంతంలోని అన్యాక్రాంతం భూముల పై సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆక్రమణలకు సంబంధించిన భూముల గుర్తింపు సమగ్ర వివరాలు అందచేయాలని పేర్కొన్నారు. గోపాలనగర్ పుంత పట్టాలు , ఇందిరా నగర్ 45 వ వార్డు ఇరిగేషన్ స్థలం పట్టాలు , 46 వ వార్డు శానిటోరియం పట్టాలు, సర్వే నెంబర్ 43/1, 43/2 , 47/1 , 48/2 లలో డంపింగ్ యార్డ్ లకు చెందిన ఆక్రమణల గుర్తింపు, పట్టాలు సర్వే, రెవెన్యు రికార్డుల ప్రకారం హక్కులు కలిగివున్నది లేనిది అధ్యయనం చేసి నివేదిక అందజేయాల్సి ఉందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి రెవెన్యు రికార్డులను పరిశీలించడం భూమి యొక్క వర్గీకరణ తో కూడి సమగ్ర వివరాలు అందచేయాలని పేర్కొన్నారు. నిబంధనలు ప్రకారం బండి దారి, కాలుదారి ఉన్నాయో నిర్ధారణ చేయాలన్నారు. ఆర్ వో ఆర్, 22 ఏ రికార్డులను పరిశీలించడం ద్వారా నివేదిక అందజేయాలన్నారు. వీటికి సంబందించి ఎటువంటి ఆటంకం లేని వాటికీ మినహాయింపులు కల్పించడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఆక్రమణలను తొలగించడం ద్వారా అర్హులైన వారికీ వేరొక చోట స్థల కేటాయింపు లేదా ఇంటి కేటాయింపు కోసం మునిసిపల్ కమిషనర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఆర్ ఎం సి టౌన్ ప్లానర్ ఆర్. కోటయ్య, కలక్టరేట్ ఏ వో మహ్మద్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.