-42 రోజుల్లోనే 80.37 లక్షల సిలెండర్లు బుకింగ్
-62.30 లక్షల గ్యాస్ సిలెండర్లు డెలివరీ
-రూ. 463. 81 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
-రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 01న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం 42 రోజుల్లోనే 59.84 లక్షల మంది 80.37 లక్షల సిలెండర్లు బుక్ చేసుకోగా 58.30 లక్షల మందికి 62.30 లక్షల సిలెండర్లు డెలివరీ చేయడం జరిగింది. ఇందుకు రూ. 463. 81 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. దీపం -2 పథకంతో ప్రతి పేద వాడి ఇంట్లో దీపపు కాంతులు విరాజిల్లుతున్నాయి. కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం-2 పథకం రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 55 లక్షల మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండేవిధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం …మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేయడం జరిగింది.
దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ – జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు
1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్
3) చెల్లుబాటు అయ్యే ఆథార్ కార్డు
4) ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి
ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.