– స్వర్ణాంధ్ర @ 2047 జిల్లాస్థాయి లక్ష్యాల సాధనకు కృషిచేయాలి
– రియల్‌టైమ్ గవర్నెన్స్, పీజీఆర్ఎస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి తదితర 10 సూత్రాల ఆధారంగా రూపొందిన డాక్యుమెంట్‌కు సంబంధించి జిల్లాస్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు తమ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీ), పీజీఆర్ఎస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని.. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సాంకేతికత అనుసంధానంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోందని.. ఇందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ) వృద్ధికి సమన్వయంతో పనిచేయాలని.. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, సేవారంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశమున్న అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఈ దిశగా కూడా ఆలోచించాలన్నారు.
పీజీఆర్ఎస్‌కు 108 అర్జీలు:
సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ లక్ష్మీశ ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారికి సూచనలు చేసి, అర్జీదారులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మొత్తం 108 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ అర్జీలు 39 వచ్చాయి. పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి 15, పోలీస్ 11, పంచాయతీరాజ్‌కు సంబంధించి 7, విద్య 5, డీఆర్డీఏ 4, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ 3, ట్రైబల్ 3, ఐసీడీఎస్ 3, సివిల్ సప్లై 2, ఉపాధి కల్పన 2, ఎల్డియం 2, మార్కెటింగ్ 2, విభిన్నప్రతిభావంతులు, ఆర్ డబ్ల్యు ఎస్, హెల్త్ / మెడికల్; రోడ్లు-భవనాలు, ఫిషరీస్, అటవీ, కోఆపరేటివ్, ఇరిగేషన్, ఆర్ ఎం ఏపీఎస్ ఆర్టీసీ, సర్వే శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను పరిష్కరించాలని, రీఓపెన్ కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని, ఎక్కడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.