-ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిగా కర్ణాటకలో విద్యావిధానంలో అమలు
-ప్రత్యేక అతిథులుగా ఏపీ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు గారు, IAS., గారు మరియు డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాల కృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో డి.ఎస్.ఆర్.టి (Department of State Educational Research and Training) మరియు బాల్ రక్షా భారత్ -సేవ్ ది చిల్డ్రన్ సాంకేతిక భాగస్వామ్యంతో కర్ణాటకలో పాఠశాల విద్యార్థులకు కన్నడ- ఆంగ్ల భాషలో ప్రావీణ్యతను పెంపొందించడానికి బైలింగువల్ నిఘంటువును రూపొందించారని సేవ్ ది చిల్డ్రన్ సౌత్ ప్రతినిధి, మల్లాడి శ్రీనగేష్ తెలిపారు.
ఈ డిక్షనరీ బుధవారం బెంగళూరులోని డిఎస్ఈఆర్టీ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. వేదికపై డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాలకృష్ణ, వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు IAS., ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
సభలో డీఎస్ఈఆర్టీ డైరెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ 1-5 తరగతులకు, 6-8 తరగతులకు కరికులం ఆధారంగా వేర్వేరుగా కన్నడ – ఆంగ్ల భాషా డిక్షనరీలు రూపొందించామని, కఠిన పదాలను, వ్యాకరణం, పదాల ఉచ్ఛారణ వంటి వాటిని పరిగణనలోనికి తీసుకున్నామని అన్నారు. తద్వారా విద్యార్థులు సులువుగా నేర్చుకోవడం, వాక్యాలను రూపొందించడం, చదవడం వల్ల కన్నడ -ఆంగ్ల బహు భాషల్లో ప్రావీణ్యత సాధించిగలరని అన్నారు. తమ రాష్ట్రం నుండి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను పర్యటించి బైలింగువల్ పుస్తకాలు, డిక్షనరీలు పరిశీలించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ స్ఫూర్తితో ఈ నిఘంటువు రూపొందించామని ప్రశంసించారు.
ఈ డిక్షనరీల రూపకల్పనలో బాల్ రక్షా భారత్ సాంకేతికతను అందించగా, డీఎస్ఈఆర్టీ (కర్ణాటక) సంస్థ సబ్జెక్టు నిపుణులు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది శ్రమించి రూపొందించడం గమనార్హం అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు ప్రత్యేక అతిథిగా బి. శ్రీనివాసరావు IAS., వర్చువల్ గా పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ బై-లింగువల్ డిక్షనరీ మరియు బైలింగువల్ పాఠ్య పుస్తక అమలు అనుభవాలను పంచుకుని, డీఎస్ఈఆర్టీ, బాల్ రక్షా భారత్ సంస్థలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు రూపొందించి విద్యార్థుల్లో మరింత భాషా ప్రావీణ్యం పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యాభివృద్ధికి ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ, తరగతి వారీ అభ్యసనా సామర్థ్యాలు సాధించడానికి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం మరియు స్టెమ్ ఆధారిత విద్యను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బాల్ రక్షా భారత్ కూడా తమకు సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నమూనా ద్వారా కర్ణాటకలో కూడా 1-8 తరగతి వరకు బహుభాషా నిఘంటువును తయారుచేసి పిల్లలకు అందించడం పిల్లలకు భాషాభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో డీఎస్ఈఆర్టీ ప్రతినిధులు రాధా, విజయమ్మ, బాల్ రక్షా భారత్ సంస్థ నుండి డైరెక్టర్ అవినాష్ సింగ్, డైరెక్టర్, చంద్రశేఖర, సౌత్ ప్రతినిధి ఎడ్యుకేషన్ సలహాదారు మల్లాడి శ్రీనగేష్, విషయనిపుణులు తదితరులు పాల్గొన్నారు.