-పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం
-“సహకారం-తో-సంవృద్ధి” కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 10,212 నూతన బహుళ ప్రయోజన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మరియు మత్స్యకార సహకార సంఘాలను 2023 నుండి రిజిస్టర్ అయ్యి నడపబడుతున్నందున ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. బుధవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన “సహకారం-తో-సంవృద్ధి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి కేంద్ర సహకార శాఖామాత్యులు ఢిల్లిలో అధ్యక్షత వహించిన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తాడేపల్లిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థతో బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 932 మహిళా డేయిరీ సహకార సంఘాలు నడపబడుతున్నాయని, వీటి ద్వారా రొజుకు ప్రస్తుతం 1,60,000 లీటర్ల పాలు సేకరించి డెయిరి ఏజెన్సీలకు సరఫరా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా 45,000 కుటుంబాలకు లబ్ధి చేకురుతోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి, సహకార వ్యవస్థ ద్వారా కొత్తగా ఏర్పడిన సొసైటీలకు మద్దతుగా లాభదాయకమైన ధరను పొందడానికి పాల పరీక్ష యంత్రాలు మరియు శీతలీకరణ సౌకర్యాలను కల్పిస్తోందన్నారు.
అదే విధంగా సొసైటీల సభ్యులను సహకార సూత్రాలు మరియు ఆచరణీయ మార్గాల్లో పాల వ్యాపారం నిర్వహణపై శిక్షణ మరియు సామర్థ్య పెంపుదల దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశుగ్రాసం పెంపకం దారులు మరియు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రంలో ఫాడర్ ప్లస్ FPOలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సహకార సంఘాలకు నగదు ఉపసంహరణ పరిమితిని సంవత్సరానికి ₹1 కోటి నుండి ₹3 కోట్లకు పెంచామన్నారు. దేశ వ్యాప్తంగా పాల సేకరణలో 4వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పాడి రైతులకు, పాల సంఘాలకు, మత్స్యకార సంఘాలకు ప్రశంసా పత్రాలను మంత్రి అచ్చెన్నాయుడు అందచేశారు. మత్స్య పరిశ్రమలో 2,400 ప్రాదమిక సహకార సంఘాలు 3 లక్షల మందికి చేదోడుగా నిలిచాయని, ఈ సంఘ సభ్యులకు బోట్లు, వలలు మరియు చేప పిల్లలు పంపిణీ చేస్తూ వారి ఆర్దిక వ్రుద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సహకార సంఘాలకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టిందని, సహకార సంఘాలకు ఆదాయ పన్ను ను 30% నుండి 15% కు కుదించడం ద్వారా అధిక లాభాల బాటలో పయనించేందుకు మార్గం సుగమం అయిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్, డైరెక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ కమీషనర్ డోలా శంకర్, ఆప్కాబ్ సీజీఎమ్ వెంకటరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.