– పటిష్ట ప్రణాళికతో ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు
– స్టీరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చేవారికి మరింత మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని.. ఇందుకు సంబంధించి పటిష్ట ప్రణాళికతో ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, స్మృతివనానికి సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు, వాహనాల పార్కింగ్ ప్రాంత విస్తరణ, ఫౌంటెయిన్లు, ఆర్‌వో ప్లాంట్, చిల్డ్రన్ ప్లే ఏరియా తదితరాలతో పాటు సుస్థిర నిర్వహణ పరంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటెయిన్, కుడ్య చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తదితరాల సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు కూడా ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. అభివృద్ధి చేసిన హరిత ప్రాంత అందం చెక్కుచెదరకుండా చూడాలన్నారు. సాధారణ రోజులతో పాటు సెలవు రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాల పార్కింగ్ విస్తరణపైనా దృష్టిసారించాలన్నారు. డాల్బీ ఆటమ్స్ విహారా మినీ థియేటర్‌ను అందుబాటులోకి తేవడం, ప్రదర్శనలు, ఫుడ్ కోర్టు, వైజ్ఞానిక వినోద కార్యక్రమాల నిర్వహణ తదితరాలపైనా సమావేశంలో చర్చించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, జిల్లా ఎస్‌సీ సంక్షేమ, సాధికారత అధికారి శిరోమణి, ఏపీఐఐసీ జెడ్ఎం కె.బాబ్జీ, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.