పోతేపల్లి (మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం, పోతేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామంలోని సచివాలయం వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను చేపడుతోందని, ఈ క్రమంలో ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే విధంగా మీ భూమి మీ హక్కు పేరుతో రెవిన్యూ సదస్సులు కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. గత ప్రభుత్వంలోని పాలకులు వారి ఇష్టారాజ్యంగా భూ సరిహద్దులను మార్చేసి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. వాటన్నిటిని సరిచేసే క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన ఐదు సంతకాల్లో రెండవ సంతకంతో భూ హక్కు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రతి రెవిన్యూ గ్రామ పరిధిలో రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. పోతేపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటు గుంతలతో పాడైపోయిన రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సెంటు భూమి ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చేవారని అవి ఏ విధంగాను సరిపోక ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.2.50 లక్షలను మంజూరు చేస్తుందని, దానితోపాటు అవసరమైన వారికి బ్యాంకు ద్వారా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పోతేపల్లిలో జూవెలరి పార్క్ ఏర్పాటుతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోందని, త్వరలో మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో పాటు అనుబంధ పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు కల్పనతో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో తాగునీరు, డ్రైనేజ్ సమస్య ఉందని, త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. పోతేపల్లె నుంచి పెదపట్నం గ్రామం వరకు నీటి సమస్యను అధిగమించేందుకు నేరుగా కృష్ణానది నుంచి పైపులైను నిర్మాణం లేదా ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెరువును నిర్మించి నిరంతర నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం నిర్వహిస్తూ భూ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిందని, దానిని రద్దుచేసి రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకే పాలనతో అధికారులను గ్రామాలకు పంపి సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దుచేసి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా నూతన పాసు పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బందరు ఆర్డిఓ కే స్వాతి, తహసిల్దార్ మధుసూదన రావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు లంకే శేషగిరిరావు, లంకె నారాయణ ప్రసాద్, తలారి సోమశేఖర్, మధు, ఆంజనేయులు, కుంచె నాని, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.