– ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనకు కృషి చేస్తున్నాం
– హోటళ్ల యాజమానులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమంలో హోటళ్ల యాజమానులు కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. నగరంలోని వివిధ హోటళ్ల యజమానులతో సమావేశమయ్యారు. జిల్లాకు పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని అమలు చేసేలా ఆలోచన చేస్తున్నామని అన్నారు. జిల్లాలో కనక దుర్గమ్మ దేవాలయంతో పాటు భవానీ ద్వీపం, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రం, కొండపల్లి ఖిల్లా వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలున్నాయని.. జిల్లాలోని పర్యాటక కేంద్రాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి మరింతమంది పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ప్రత్యేక ప్యాకేజీతో ట్యాక్సీ, వాహన యజమానులతో పాటు ఆతిథ్య రంగ అభివృద్ధికీ అవకాశముంటుందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందన్నారు. ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నామని.. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వివరించారు. సమావేశంలో జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ఆర్‌వీ స్వామి, వి.రాఘవేంద్ర,హోటల్ ఐలాపురం ప్రతినిధి రాజా, బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.