రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల వారిని మైనారిటీలుగా పరిగణిస్తామని అన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ చట్టం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు (జోరాస్ట్రియన్) మరియు జైన మతాలకు వర్తిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 29 మరియు 30 అధికరణలు మతపరమైన, సాంస్కృతిక మరియు భాషాపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షిస్తాయని, వారి వారసత్వం మరియు సంస్కృతిని సంరక్షించడానికి, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు వీలు కల్పిస్తాయని తెలిపారు. మతం, భాష, సంస్కృతల ఆధారంగా మైనారిటీల పట్ల వివక్ష చూపించడం తగదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మైనారిటీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. సీనియర్ న్యాయవాది పి.శ్రీనివాస్ రాజ్యాంగంలోని మైనారిటీల సంబంధిత అధికారణల గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మైనారిటీల ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్ .సునీల్ కుమార్, మైనారిటీ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …