– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు అండగా నిలిచేతత్వమే వంగవీటి మోహన రంగా కి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వీఎం రంగా వర్థంతిని పురస్కరించుకుని పాయకాపురంలోని ఆయన విగ్రహానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు రంగా నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయన్నారు. పేద ప్రజలందరికీ పట్టాలివ్వాలన్న రంగా సంకల్పాన్ని.. గత జగనన్న ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
కాపుల కల సాకారం చేశాం
రాబోయే తరాలు వంగవీటి మోహన రంగా పేరు స్మరించుకునే విధంగా ఎల్బీఎస్ నగర్లో రూ. కోటి 25 లక్షల వ్యయంతో నిర్మించిన కాపు కళ్యాణ మండపానికి ఆయన పేరు పెట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో కాపు కళ్యాణ మండపాన్ని కేవలం జీవోలకే పరిమితం చేశారని ఆరోపించారు. గులాబీతోట, రాధానగర్లలో నిర్మిస్తున్నట్లు శిలాఫలకాలు వేసి హడావుడి చేసినా.. ఏమాత్రం కార్యరూపం దాల్చలేదన్నారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడి కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ మేరకు డిసెంబర్ 29, 2021 న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.165 విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఫిబ్రవరి 23, 2023న ఎల్బీఎస్ నగర్ లో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన జరగగా.. ఏడాది కాలంలోనే పనులు పూర్తి చేసుకుని మార్చి 14, 2024 న సకల హంగులతో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే కాపు నేస్తం ద్వారా నియోజకవర్గంలో 2,583 మందికి రూ. 12.74 కోట్ల లబ్ధి చేకూరినట్లు వివరించారు. కనుక భౌతికంగా రంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నింపిన స్ఫూర్తి ప్రతిఒక్కరిలో ఎప్పటికీ బ్రతికే ఉంటుందని మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 64 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, నాయకులు అలంపూర్ విజయ్, హాఫీజుల్లా, సవరం కోటేశ్వరరావు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.