– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వంగవీటి మోహనరంగా వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వంగవీటి మోహనరంగా అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. అధిష్టానం నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించేవారని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున నిలబడే నేతగా చెప్పుకొచ్చారు. గాంధీనగర్ సబ్ జైలులో ఉండి కూడా కృష్ణలంక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక్క రంగా గారేనని వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై.. నగర ప్రజలకు విశేష సేవలందించారన్నారు. భారీవర్షాలు, వరదలకు నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన సమయంలో దగ్గరుండి బాధితులను ఆదుకున్నారన్నారు. అటువంటి నేత గూర్చి ఎంత తెలుసుకున్నా.. తెలుసుకోవలసింది ఇంకా మిగిలే ఉంటుందన్నారు. రంగా లాంటి నేతలు ఇద్దరు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేయవచ్చని ఆనాడు కోన ప్రభాకరరావు అన్న మాటలు అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్ గా అభివర్ణించారు.
విజయవాడను పోరాటాల గడ్డగా మార్చిన నేత
1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ విధానాలపై వీఎం రంగా చేసిన అలుపెరుగని పోరాటాలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేసుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన ధీశాలి అని చెప్పుకొచ్చారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టీకాలకు తెగబడినా.. ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. శిరోముండనం, లాకప్ డెత్ లు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో.. ప్రజలకు అండగా నిలిచారన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్లు తీసుకొచ్చిన సమయంలో.. పేదల తరపున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా అని చెప్పారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం ఉద్యమాలకు వేదికగా మారిందన్నారు. కనుకనే కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నారన్నారు.
వీఎం రంగా స్ఫూర్తితో 26 వేల మందికి పట్టాల పంపిణీ
పేద ప్రజల కోసం దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆఖరి క్షణం వరకు పోరాటం చేశారని.. ఆయన స్ఫూర్తితో 2019-24 మధ్య కాలంలో 26 వేల మంది పేదలకు ఇంటి స్థలాలపై సర్వ హక్కులు కల్పించేందుకు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందన్నారు. జీవో నెం.105 ద్వారా గతంలో పునరావాస లబ్ధిదారులకు కేటాయించిన రాజరాజేశ్వరి పేట, వాంబేకాలనీలోని 2,763 ఇళ్లకు రిజిస్ట్రేషన్లను పూర్తిచేయడం జరిగిందన్నారు. నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) లో ఉన్న భూములను సదరు జాబితా నుంచి తొలగించి.. నార్త్ మండల పరిధిలోని 20,944 కుటుంబాలకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించడంతో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న భూసమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. జీవో నెం. 60 ద్వారా 100 గజాల లోపు ఉన్న 115 కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడమైందని పేర్కొన్నారు. నందమూరినగర్లోని ఆర్ & బి స్థలంలో 69 మంది నివాసులు దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యకు జీవో నెం. 11 ద్వారా పరిష్కారం చూపడమైందని తెలిపారు. అలాగే కస్తూరిభాయిపేట, గిరిపురం పరిధిలోని నిరంభ్యతర ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల స్థలాలను రెగ్యులరైజేషన్ చేసి.. 98 మంది లబ్ధిదారులకు హక్కుతో కూడిన పట్టాలు అందజేసినట్లు వివరించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి నేతలు పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని… వారి మాయలో పడొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరూ తమ తమ వార్డు సచివాలయాల పరిధిలో వీఆర్వోలను సంప్రదించినట్లయితే.. ఇళ్లను రెగ్యులరైజ్ చేసి హక్కుతో కూడిన పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను సొంత కష్టాలుగా పోరాడి విజయవాడ నగర ప్రజల హృదయాలలో వీఎం రంగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, ఇసరపే దేవి రాజారమేష్, నాయకులు అలంపూర్ విజయ్, హాఫీజుల్లా, గుండె సుందర్ పాల్, యర్రంశెట్టి అంజిబాబు, కాళ్ల ఆదినారాయణ, మేడా రమేష్, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణిరెడ్డి, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.