Breaking News

కార్పొరేట్‌కు దీటుగా సివిల్స్ శిక్ష‌ణ‌

– బీసీ సివిల్ స‌ర్వీసెస్ స్ట‌డీ స‌ర్కిల్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
– త్వ‌ర‌లో అమ‌రావ‌తిలో శాశ్వ‌త సివిల్స్ స్ట‌డీ స‌ర్కిల్ ప్రాంగ‌ణం
– న‌వ్యాంధ్ర నిర్మాణంలో యువ‌త భాగ‌స్వాములు కావాలి
– రాష్ట్ర బీసీ సంక్షేమం; ఈడ‌బ్ల్యూఎస్ సంక్షేమం; చేనేత‌, జౌళి శాఖామంత్రివ‌ర్యులు ఎస్‌.స‌విత‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్ స్ట‌డీ స‌ర్కిళ్ల‌కు దీటుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలోని బీసీ సివిల్ స‌ర్వీసెస్ స్ట‌డీ స‌ర్కిల్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. అభ్య‌ర్థులు ఈ సౌక‌ర్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం; ఈడ‌బ్ల్యూఎస్ సంక్షేమం; చేనేత‌, జౌళి శాఖామంత్రివ‌ర్యులు ఎస్‌.స‌విత అన్నారు.
బుధ‌వారం విజ‌య‌వాడ రూర‌ల్‌, గొల్ల‌పూడిలో రాష్ట్ర బీసీ సివిల్ స‌ర్వీసెస్ స్ట‌డీ స‌ర్కిల్‌ను మంత్రి స‌విత‌.. శాస‌న‌స‌భ్యులు, వివిధ కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్లు, అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. డిజిట‌ల్ త‌ర‌గ‌తిగ‌దులు, డిజిట‌ల్ లైబ్ర‌రీ, డిస్క‌ష‌న్ రూమ్స్ త‌దిత‌రాల‌ను కూడా ఆమె ప్రారంభించారు. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించిన అనంత‌రం మంత్రి స‌విత మాట్లాడుతూ 600 మంది అభ్య‌ర్థులు అర్హ‌త ప‌రీక్ష రాయ‌గా.. 100 మంది ఉచిత సివిల్స్ శిక్ష‌ణ‌కు ఎంపిక‌య్యార‌ని వివ‌రించారు. యువ‌త స్ట‌డీ స‌ర్కిల్‌లోని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకొని మంచి ఫ‌లితాలు సాధించాల‌ని సూచించారు. దార్శ‌నిక ముఖ్య‌మంత్రి తొలి సంత‌కం మెగా డీఎస్సీపై పెట్టార‌ని.. అంత‌టితో ఆగ‌కుండా 26 జిల్లాల్లోనూ ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ అందించేందుకు చొర‌వ‌చూపార‌న్నారు. త్వ‌ర‌లో ఆన్‌లైన్ డీఎస్సీ శిక్ష‌ణను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఒక్కో సివిల్స్ అభ్యర్థికి దాదాపు రూ. 2 లక్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని.. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ప్ర‌భుత్వం సివిల్స్ స్ట‌డీ స‌ర్కిల్ ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. అభ్య‌ర్థులు క‌ష్ట‌ప‌డి చ‌దివి, సివిల్స్‌లో మంచి ఫ‌లితాలు సాధించి మంచిపేరు తీసుకురావాల‌ని అభ్య‌ర్థుల‌కు సూచించారు. స్వ‌ర్ణాంధ్ర @ 2047 విజ‌న్ సాకారానికి గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి సారథ్యంలో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని.. న‌వ్యాంధ్ర నిర్మాణంలో యువ‌త భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి స‌విత పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భవ‌నంలో సివిల్స్ స్ట‌డీ స‌ర్కిల్ కొన‌సాగుతోంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నంతో త్వ‌ర‌లో అమ‌రావ‌తిలో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మంచి వాతావ‌ర‌ణంలో సివిల్స్ స్ట‌డీ స‌ర్కిల్ ప్రాంగ‌ణం ఏర్పాట‌వుతుంద‌ని.. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

సివిల్స్ క‌ష్టం.. క్లిష్ట‌మే అయినా సాధ్య‌మ‌య్యేదే: ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్‌
మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని మంచిగా ఉప‌యోగించుకొని సానుకూల దృక్ప‌థంలో యువ‌త ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే తొలి మెట్టును దాటార‌ని.. బాగా క‌ష్ట‌ప‌డి చ‌దివి, సివిల్స్ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాల‌ని సూచించారు. సివిల్స్ క‌ష్టం.. క్లిష్ట‌మే అయినా సాధ్య‌మ‌య్యేదేనని.. ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చిన సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకొని పైకి ఎద‌గాల‌న్నారు. క‌ష్ట‌ప‌డుతూ ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేయ‌డం ద్వారా అనుకున్న ల‌క్ష్యాన్ని ఎలా సాధించవ‌చ్చ‌నే విష‌యానికి ట్వ‌ల్త్ ఫెయిల్ చిత్రం నిద‌ర్శ‌మ‌న్నారు.

మెయిన్స్‌కు ప్రిపేర‌వుతూ ప్రిలిమ్స్‌కు ప్రాక్టీస్ చేయాలి: శాస‌న‌స‌భ్యులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు
తిరువూరు శాస‌న‌స‌భ్యులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ఏమి చ‌ద‌వాలి? ఎలా చ‌ద‌వాలి? అనేదానిపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకొని ముందుకు సాగితే సివిల్స్ విజ‌యం సాధ్య‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. సివిల్స్ స్ట‌డీ స‌ర్కిల్‌ను స‌ద్వినియోగం చేసుకొని వంద‌కు వందమంది అభ్య‌ర్థులు వ‌చ్చే ఏడాది ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించి.. మెయిన్స్ ఆపై గెలుపు దిశ‌గా అడుగులేయాల‌న్నారు. మెయిన్స్‌కు ప్రిపేర‌వుతా ప్రిలిమ్స్‌కు ప్రాక్టీస్ చేసిన‌ప్పుడే విజ‌యం సాధ్య‌మ‌వుతుంద‌ని.. ఈ విష‌యాన్ని అభ్య‌ర్థులు గుర్తించాల‌ని సూచించారు. తానుకూడా ఎక‌నామిక్స్ క్లాస్‌లు తీసుకుంటాన‌ని శ్రీనివాస‌రావు తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ డా. ఎ.మ‌ల్లిఖార్జున‌, సెక్ర‌ట‌రీ పోలా భాస్క‌ర్ త‌దిత‌రులు అభ్య‌ర్థులుకు క‌ల్పించిన సౌక‌ర్యాలు, విజ‌యానికి సోపాల‌ను వివ‌రించారు.
కార్య‌క్ర‌మంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎన్‌టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *