– అందుబాటులోకి వచ్చిన ఆధునిక యాప్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెక్ తోడుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ శాఖల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబుతో కలిసి యాప్‌ను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పులపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మొబైల్ యాప్‌ను భక్తులు గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. దర్శనాల బుకింగ్, దర్శనాల సమయం, ప్రసాదం కౌంటర్లు, పూజా విధానాలు, అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, ఫిర్యాదుల నమోదు, అత్యవసర ఫోన్ నంబర్లు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఇలా సమస్త సమాచారం యాప్‌లో అందుబాటులో ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. భక్తులు https://play.google.com/store/apps/details?id=io.ionic.starterbhavani లింక్ ద్వారా భవానీ దీక్ష 2024
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.